Telangana: లగచర్ల ఘటన, అనంతర పరిణామాలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల బాధిత రైతు కుటుంబాలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. వారి వెంట బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఈ సందర్భంగా కమిషన్‌కు బాధిత కుటుంబ సభ్యులు వివరించారు. అధికారులపై దాడి అనంతర పరిణామాలు, కేసులు, తమ కుటుంబ సభ్యులపై పోలీసుల దౌర్జన్యం, ఫార్మా కంపెనీలకు భూములిచ్చే వ్యవహారంపై వారు ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Telangana: పోలీసులు అర్ధరాత్రి తమ ఇండ్లపై పడి దౌర్జన్యం ప్రదర్శించారని లగచర్ల బాధిత కుటుంబ సభ్యులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎదుట కన్నీరు మున్నీరుగా ఏకరువు పెట్టారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తిస్తూ, పురుషులను దౌర్జన్యంగా లాక్కెళ్లి, వ్యాన్లలో కుక్కి కొట్టుకుంటూ తీసుకెళ్లారని తెలిపారు. పోలీసుల దాడి ఘటనపై కమిషన్ మహిళా సభ్యులతో మహిళా బాధితులతో విచారించాలని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్యను కోరారు.
Telangana: లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల కోసం భూములను బలవంతంగా లాక్కోవడం సరికాదని తేల్చి చెప్పారు. భూమినే నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమై పోవాలని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని, కానీ, స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కల్పించారని చెప్పారు. లగచర్లలో కమిషన్ త్వరలో పర్యటిస్తుందని, ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటుందని, అన్యాయం జరిగితే కమిషన్ అస్సలు ఊరుకోదని చైర్మన్ వెంకటయ్య అభయం ఇచ్చారు.