IPL Auction: ఐపీఎల్ మెగా వేలం బరిలో 574 మంది పాల్గొంటున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల లిస్టులో చోటు చేసుకున్న 1574 మంది ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను కుదించి తాజా లిస్టును బిసిసిఐ వెల్లడించింది. ఈ 574లో 366 మంది భారత ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ క్రికెటర్లు. బీహార్ యువ సంచలనం 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కనీస ధర 30 లక్షలతో ఈ వేలం బరిలో దిగనున్న అతిపిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. కాగా, ఈ వేలంలో 81 మంది ఆటగాళ్ల కనీస ధర రూ.2 కోట్లు. పంత్, శ్రేయస్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్, షమి, సిరాజ్, చాహల్, అవేశ్ ఖాన్, బట్లర్, రబాడ, నోకియా, మ్యాక్స్‌వెల్ తదితర ఆటగాళ్లు అత్యధిక కనీస ధర విభాగంలో ఉన్నారు. రూ.1.5 కోట్ల కనీస ధరతో 27 మంది, రూ.1.25 కోట్లతో 18 మంది, రూ.1 కోటితో 23 మంది ఆటగాళ్లు వేలానికి సిద్ధమయ్యారు. ఇటు ఐపీఎల్ ఫ్యాన్స్.. అటు ఫ్రాంచైజీల ఓనర్లలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరడంతో ఆటగాళ్ల వేలంపై మరింత ఆసక్తి పెరుగుతోంది.