Saudi Accident: సౌదీ అరేబియాలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ను విషాదంలో ముంచేసింది. ఉమ్రా యాత్రకు వెళ్లిన నగరవాసులు మదీనాకు ప్రయాణిస్తున్న సమయంలో బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి అనేక మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది హైదరాబాద్ వాసులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో మల్లేపల్లి బజార్‌ఘాట్‌కు చెందినవారి సంఖ్య అధికంగా ఉండటం మరింత కన్నీళ్లు తెప్పిస్తోంది.
హైదరాబాద్‌లోని మల్లేపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన 18 మంది ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వీరిలో రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూర్, మహ్మద్ అలీతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.
Also Read: CP Sajjanar: పైరసీ ముసుగులో బెట్టింగ్ దందా.. 50 లక్షల మంది డేటా ప్రమాదంలో!
ఈయాత్రికులు ఈనెల 9న మెహదీపట్నం ఫ్లైజోన్ ఏజెన్సీ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ఉమ్రా కోసం బయల్దేరారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మదీనా నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్–మదీనా మధ్య ఉన్న ముఫరహత్ ప్రాంతంలో బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి, అందులో ఉన్నవారిలో 42 మంది నిద్రలోనే సజీవదహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో హైదరాబాదీలు కూడా ప్రాణాలు కోల్పోవడం నగరంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రానున్నప్పటికీ, ప్రభుత్వం వెంటనే స్పందించి సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అవసరమైన సమాచారానికి 79979 59754, 99129 19545 నంబర్లలో ఎప్పుడైనా సంప్రదించవచ్చని ప్రకటించింది. ఈ ప్రమాదం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర సంతాపం వ్యక్తం అవుతోంది.

