Sankranthi Vasthunna: ఏమిటేమిటీ బాహుబలి 2 రికార్డును సంక్రాంతికి వస్తున్నాం దాటేసిందా? కామెడీ వద్దు బాసూ అంటున్నారా. అయితే జరా రుకో.. ఇది పూర్తిగా చదవండి. నిజమే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రేంజ్ కి బాహుబలి 2 రేంజ్ కి పోలికేలేదు. అసలు రెండిటి మధ్య పోలిక మాట్లాడితే అది కామెడిగానే ఉంటుంది. కానీ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లు బహుబలి2 తో పోల్చాల్సిన పరిస్థితి వచ్చింది. బాహుబలి2 ప్రపంచ సినిమా. దాని కలెక్షన్ల రికార్డులు ప్రపంచ రికార్డులే. కానీ, లోకల్ కి వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం ముందు బాహుబలి2 రికార్డులు కదిలిపోతున్నాయి.
పండక్కి నవ్విస్తామంటూ వచ్చి.. పండగ కలెక్షన్లు మొత్తం లాగేసింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలబడబోతోంది ఈ మూవీ. సినిమా విడుదలకు ముందే ఒకరకమైన వైబ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. సినిమా విడుదలయ్యాకా థియేటర్లను కళ కళ లాడేలా చేసింది. సంక్రాంతి వచ్చింది వెళ్ళిపోయింది. కానీ, వెంకీ మూవీ మాత్రం ఫిక్స్ అయిపొయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్యామిలీలకు ఫ్యామిలీలు థియేటర్ల దగ్గర క్యూలు కడుతున్నాయి. అసలు ఈ మధ్య కాలంలో ఇంత రేంజ్ హిట్ లేదు అంటే అతిశయోక్తి కాదు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని థియేటర్లలోనే చూడాలి అని ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయినట్టు పరిస్థితి మారిపోయింది.
ఏదైనా సినిమాకి వెళ్ళాలి అంటే ఈమధ్య కాలంలో రేట్లకు జడిసి ఇంటిలో ఒకరో ఇద్దరో తమకు నచ్చిన హీరో సినిమా అయితే వెళ్లి చూసి వస్తున్నారు. కానీ, సంక్రాంతికి వస్తున్నాం ట్రెండ్ సృష్టించింది. మొత్తం కుటుంబం అంతా కలిసి వెళ్లి సినిమా చూస్తున్నారు. అబ్బా ఎంతకాలం అయిందో అందరం కలిసి సినిమాకి వెళ్లి అని అనుకుంటూ వెళుతున్న ప్రేక్షకులు సినిమా చూసి అంత సంతోషంతోనూ బయటకు వస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hong Kong Warriors: 24న నాలుగు భాషల్లో ‘హాంగ్ కాంగ్ వారియర్స్
Sankranthi Vasthunna: సరే.. ఇప్పుడు బాహుబలి2 ని సంక్రాంతి ఎక్కడ దాటేసిందో చెప్పాలి కదా. కాకినాడ జిల్లా మండపేటలో బాహుబలి2 మూవీ రికార్డ్ బ్రేక్ అయిపొయింది. అక్కడ సినీ వర్గాల సమాచారం ప్రకారం బాహుబలి2 మూవీ లాంగ్ రన్ లో 90 లక్షలు వసూలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో 68 లక్షలు వసూలు చేసింది. అయితే.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం.. కేవలం 10 రోజుల్లోనే ఈ వసూళ్లను దాటేసింది. మొదటి నాలుగురోజుల్లోనే సంక్రాంతికి సినిమా 60.57 లక్షలను వసూలు చేసింది. తరువాతా అదే జోరు కొనసాగిస్తోంది. దీంతో అల వైకుంఠ పురం కలెక్షన్లు కూడా దాటేసింది. ఇక మొదటివారం కలెక్షన్లలో బాహుబలి2ని దాటేసిన వెంకీ మూవీ ఇప్పుడు రెండో వారంలో బాహుబలి2 లాంగ్ రన్ రికార్డ్ బ్రేక్ చేసేలా ఉంది. అక్కడి ట్రేడ్ లెక్కల ప్రకారం మండపేటలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది.
దాటేయదూ మరి.. ఒక్కరు వెళ్లెదగ్గర నలుగురైదుగురు వెళితే కలెక్షన్ల జోరు అలానే ఉంటుంది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. ఏ జోనర్ సినిమా అయినా ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉంటారు. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరైనది పడింది అంటే ప్రేక్షకులు అంతా కలిసి దానికే జై కొడతారు. అలా వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దిల్ రాజు ప్రొడక్షన్ లో చెప్పిమరీ మిడిల్ బడ్జెట్ సినిమా నుంచి హై బడ్జెట్ సినిమాల రికార్డులు బ్రేక్ చేసే కలెక్షన్స్ కొల్ల కొడుతోంది.