Yashoda Krishna: నటచక్రవర్తి యస్వీ రంగారావు అంతకు ముందు ‘శ్రీకృష్ణలీలలు’లో కంసుని పాత్ర పోషించి మెప్పించారు. మరోమారు అదే పాత్రలో యస్వీఆర్ నటించిన చిత్రం ‘యశోద కృష్ణ’. సి.యస్.రావు దర్శకత్వంలో సిహెచ్. ప్రకాశరావు నిర్మించిన ‘యశోద కృష్ణ’ ఈస్ట్ మన్ కలర్ లో రూపొందింది. ఇందులో బాలకృష్ణుని పాత్రలో అప్పట్లో బాలనటిగా ఉన్న శ్రీదేవి నటించడం విశేషం! యశోద పాత్రను జమున ధరించారు. కంస సంహారం, యశోద కృష్ణుల బంధం ఈ చిత్రంలోని ప్రధానాంశాలు. యస్వీఆర్ నటించిన చివరి చిత్రంగా ‘యశోద కృష్ణ’ జనం ముందు నిలచింది. రంగుల్లో రూపొందడం వల్ల ఈ సినిమా విశేషాదరణ చూరగొంది. యస్.రాజేశ్వరరావు సంగీతం ఈ సినిమాకు ఓ ఎస్సెట్. 1975 జనవరి 20 వ తేదీన ‘యశోద కృష్ణ’ విడుదలయింది. ఈ నాటికీ బుల్లితెరపై అడపాదడపా ‘యశోద కృష్ణ’ సందడి చేస్తూ ఉంటుంది.