Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి దావోస్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడి, ప్రపంచ దేశాలకు మనవాళ్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “మీ అందరిని చూస్తుంటే నాలో మరింత నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో నా కలలు నిజమవుతాయని విశ్వసిస్తున్నాను. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆర్థిక సంస్కరణలను, ఇంటర్నెట్ వనరులను వినియోగిస్తూ రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను.
ఏ ప్రాంతానికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు అందిస్తున్న సేవల పట్ల గర్వంగా ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలు రాజకీయ అనిశ్చితి ఎదుర్కొంటున్నాయి. కానీ, భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.
గత రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాదును అభివృద్ధి చేశాము. అన్ని రంగాల్లో ముందడుగు వేసి, భారతదేశంలో నివసించడానికి అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంలో నేను కృషి చేశాను” అని చంద్రబాబు నాయుడు అన్నారు.