IPS Transfers

IPS Transfers: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీ.. హోం శాఖకు శిఖా గోయల్, కీలక మార్పులు ఇవే!

IPS Transfers: తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా రేవంత్ సర్కార్ పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మే 1, 2026 నుండి ఈ కొత్త నియామకాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా హోం శాఖ, విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ వంటి కీలక విభాగాలకు కొత్త బాధ్యులను నియమించడం విశేషం.

ఈ బదిలీల్లో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌కు అత్యంత కీలకమైన బాధ్యతలు దక్కాయి. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న ఆమెను, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. దీనితో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరియు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్‌గా కూడా ఆమె అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే, ఏడీజీగా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

మరోవైపు, నగర శివార్లలోని భద్రతా వ్యవస్థలో కూడా మార్పులు జరిగాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బి. సుమతిని నియమించగా, ఇప్పటివరకు అక్కడ పనిచేసిన అవినాష్ మహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ చేశారు. అలాగే ఆయనకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ మరియు ఏసీబీ డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ నియంత్రణ, అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ నియామకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ బాధ్యతలను తరుణ్ జోషికి అప్పగించారు. సుధీర్ బాబు పదవీ విరమణ చేయడంతో, తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అటు షహ్నవాజ్ ఖాసిం మల్టీ జోన్-2 ఐజీపీగా, కార్తికేయ ఇంటెలిజెన్స్ ఐజీతో పాటు ఎస్ఐబీ ఐజీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. పాలనలో పారదర్శకత, భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *