Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అమెరికా జాతీయ క్రికెట్ లీగ్ ఎన్ సీ ఎల్ లో భాగమయ్యాడు. లీగ్ యాజమాన్యంలో తాను చేరుతున్నట్లు సచిన్ స్వయంగా ప్రకటించాడు. అమెరికాలో క్రికెట్ కు ఆదరణ లభిస్తున్న తరుణంలో ఎన్ సీ ఎల్లో చేరడం ఆనందంగా ఉందంటూ సచిన్ హర్షం వ్యక్తం చేశాడు.
అగ్రరాజ్యం అమెరికా క్రికెట్‌లో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా ఇప్పుడు దేశవాళీ లీగ్ నిర్వహణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడి యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపేందుకు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సిద్ధమయ్యాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి స్ఫూర్తి నింపిన సచిన్, ఇప్పుడు అమెరికా నేషనల్ క్రికెట్ లీగ్‌లో భాగమయ్యాడు. దీంతో తమ దేశంలో క్రికెట్‌కు చక్కని ప్రాచుర్యం లభిస్తుందని అమెరికా బోర్డు భావిస్తోంది. సచిన్ సైతం కొత్త బాధ్యతల్లో ఒదిగిపోయేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు.
Sachin Tendulkar: కొత్తగా అమెరికన్ జాతీయ లీగ్ లో భాగస్వామి కావడం తన జీవితంలో గొప్ప ప్రయాణమని, యువతరాన్ని ఉత్సాహపరిచి వారికి వరల్డ్ క్లాస్ క్రికెట్ అలవాటు చేయడమే నేషనల్ లీగ్ లక్ష్యమని ప్రకటించాడు సచిన్. కొత్త బాధ్యతను సమర్ధంగా నిర్వహించేందుకు, అమెరికాలో క్రికెట్ వ్యాప్తికి దోహదం చేసేందుకు ఉత్సంహంగా ఎదురుచూస్తున్నట్లు సచిన్ వెల్లడించాడు. 10 ఓవర్ల ఫార్మాట్ అయిన నేషనల్ లీగ్ టోర్నీలో ప్రస్తుతం ఆడుతున్న వాళ్లతో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు సైతం తమ మెరుపులతో అభిమానులను అలరించనున్నారు. సునీల్ గవాస్కర్, వసీం అక్రమ్, వివ్ రిచర్డ్స్, జయసూర్య వంటి మేటి ఆటగాళ్లు యువ ఆటగాళ్లకు మెంటార్, కోచ్ లుగా వ్యవహరించనున్నారు. షాహిద్ అఫ్రిది, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, ఉతప్ప, షకిబ్ తదితర క్రికెటర్లు ఈ లీగ్ లో బరిలో దిగుతుండడం విశేషం.
