RSS Chief Mohan Bhagwat: నాగ్‌పూర్‌లో విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ సర్వసంఘచాలక్ మోహన్ భగవత్ దేశీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.
పక్క దేశాల పరిస్థితులపై ఆందోళన
భారతదేశానికి పొరుగు దేశాల్లో చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిణామాలను భగవత్ ప్రస్తావించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఏర్పడుతున్న అశాంతి పరిస్థితులు ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాల వైఫల్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే అసంతృప్తి పెరుగుతుంది, కానీ హింసాత్మక నిరసనలు ఎవరికి మంచివి కావు” అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Palapitta: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా..?
ఉగ్రవాదం పై ఘాటైన వ్యాఖ్యలు
ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించిన భగవత్, “ఉగ్రవాదులు మతం అడిగి 26 మంది భారతీయులను కాల్చిచంపారు. ఈ దాడి దేశ ప్రజలందరినీ రగిలించింది. అయితే మన సాయుధ దళాలు, ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక అయింది” అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశానికి నిజమైన మిత్రదేశాలు ఎవరో స్పష్టమైందని ఆయన చెప్పారు.
ఐక్యతే దేశ బలం
దేశంలో ఉన్న వైవిధ్యం విభజనలకు కారణం కావొచ్చన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పటికీ, అది కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలికి సంబంధించినదే తప్ప, మనం ఒక్కటేనని భగవత్ స్పష్టం చేశారు. “ఐక్యమత్యమే మన బలం, విడిపోతే నిలబడలేం” అని ప్రజలకు పిలుపునిచ్చారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అనేది సమాజానికి ముప్పు అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Atrocity: మరీ ఇంత దుర్మార్గమా.. జాతీయ పక్షి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?
అమెరికా విధానాలపై స్పందన
అమెరికా కొత్త టారిఫ్ విధానాలు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతున్నాయని భగవత్ పేర్కొన్నారు. “ప్రతి దేశం మరొక దేశంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆ ఆధారపడటం మన ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి, ఒత్తిడితో కాదు” అని అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా రేఖాంకితం చేశారు.
దేశానికి మార్గదర్శకం
ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు దేశ సమాజానికి ఒక కొత్త దిశను చూపించాయని, ప్రభుత్వం, సైన్యం, సమాజం కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం సుస్థిరత, శాంతి, అభివృద్ధిని సాధించగలదని మోహన్ భగవత్ సందేశం ఇచ్చారు.