Rohit Sharma: అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ ఇండియన్ బ్యాటర్ రోహిత్ శర్మ.. దేశవాళీ టీ20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) నాకౌట్ మ్యాచ్‌లలో ముంబై తరఫున ఆడాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 29, 2024న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, దేశవాళీ టీ20 క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడం ముంబై జట్టుకు గొప్ప ఊపునివ్వనుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లు డిసెంబర్ 12 నుంచి 18 వరకు ఇండోర్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ డిసెంబర్ 6న ముగియగానే, రోహిత్ ముంబై జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు ధృవీకరించాయి. “ఎస్ఎమ్ఏటీ నాకౌట్ మ్యాచ్‌లలో ముంబై తరఫున ఆడాలనే తన కోరికను రోహిత్ వ్యక్తం చేశారు” అని ఎంసీఏలోని ఒక వర్గం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపింది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 4231 పరుగులతో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రోహిత్, చివరిసారిగా జూన్ 1, 2025న ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు.
Also Read:
ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ నాయకత్వంలోని ముంబై జట్టు ఎలైట్ గ్రూప్ Aలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిని గెలుచుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే నాకౌట్‌కు చేరుకోవడం ఖాయం. గ్రూప్ దశ మ్యాచ్‌ల కోసం టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ శివమ్ దూబే ముంబై జట్టులో ఉన్నారు. అయితే, దక్షిణాఫ్రికాతో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధం కావడానికి వీరు డిసెంబర్ 9న జట్టును వీడనున్నారు. వీరి స్థానంలో రోహిత్‌ను జట్టులోకి తీసుకోవాలని ఎంసీఏ సెలెక్టర్లు యోచిస్తున్నారు.
రోహిత్ శర్మతో పాటు యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్లలో ముంబై తరఫున ఆడటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జైస్వాల్‌ను టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవడంతో, అతను ఈ దేశవాళీ టోర్నమెంట్లో ఆడనున్నాడు. ఎస్ఎమ్ఏటీ ముగిసిన తర్వాత, రోహిత్, జైస్వాల్‌లు ఇద్దరూ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు కూడా ముంబై తరఫున ఆడతారని అంచనా వేస్తున్నారు. సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ చేస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

