BRS Meeting: బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన రజతోత్సవ సభ ఊహించని విషాదాన్ని తెచ్చింది. సభ ముగించుకొని తిరిగి వెళ్తున్న ఇద్దరు మేస్త్రీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన సిద్ధిపేట జిల్లా రాంపూర్ వద్ద జరిగింది.
హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన బస్వాపూర్ గ్రామస్థులు తడెం సారయ్య , బండోజు గణేష్ అనే మేస్త్రీలు, బైక్‌పై వస్తుండగా ఓ టవేరా వాహనం ఢీకొనడంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన హుస్నాబాద్-సిద్ధిపేట మార్గంలో రాజ్ గోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Sheep theft: గొర్రెల మంద కాపలికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దుండగుల దాడి.. 70 గొర్రెల అపహరణ
ప్రమాదం నేపథ్యంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. ప్రతీ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అంతేగాక, బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభల పేరుతో బీఆర్ఎస్ వాహనాలు మద్యం మత్తులో వేగంగా నడపడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందన్న ఆరోపణలు మంత్రి పోన్నం ప్రభాకర్ చేశారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు మళ్లీ ఊపందుకున్నాయి. ఎల్కతుర్తి, చింతలపల్లి శివారులో జరిగిన రజతోత్సవ సభలో భారీగా జన సమీకరణ జరిగింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్దగా బహిరంగ సభలకు హాజరు కాలేదు. అయితే ఇప్పుడు పార్టీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ సభను ఒక అవకాశంగా మార్చాలని భావించింది.అయితే, ప్రజల ఉత్సాహం మధ్య జరిగిన ఈ రజతోత్సవం మృతుల కుటుంబాలకు చిరస్మరణీయమైన విషాదం తెచ్చింది.