Road Accident: సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే… కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన పోలీసులు ఓ కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్ బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు దుర్గాపురం వద్దకు రాగానే, అకస్మాత్తుగా ఓ లారీ అదుపుతప్పి వారి కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎస్ఐ అశోక్ కుమార్ మరియు కానిస్టేబుల్ బ్లెస్సిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ముందు కూర్చున్న వారు కావడం, ఢీకొట్టిన వేగం ఎక్కువగా ఉండటం వల్ల కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఎయిర్‌బెలూన్లు తెరుచుకున్నా ప్రాణాలు కాపాడలేకపోయాయి.
ఇది కూడా చదవండి: Anantapur: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య – అనంతపురంలో ఘోరం
మరింత ఆవేదనకర విషయం ఏమిటంటే, ప్రమాదం ముందు వారు కొంత సమయం విశ్రాంతి కోసం కారు ఆపినట్టు గాయపడిన పోలీసులు చెప్పారు. గంటన్నర పాటు కారు ఆపి, తర్వాత బయలుదేరిన పదిహేను నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరిగింది.
గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు.
పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా అతి వేగం, నిద్రలేమి కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.