Rivaba Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి, గుజరాత్ రాష్ట్ర మంత్రి రివాబా జడేజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా క్రికెట్ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తన భర్త జడేజాను పొగిడే క్రమంలో ఆమె ఇతర భారత క్రికెటర్లపై పరోక్షంగా సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది.
ద్వారకలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో రివాబా జడేజా మాట్లాడుతూ, తన భర్త రవీంద్ర జడేజా క్రమశిక్షణ, నిబద్ధత గురించి ప్రస్తావించారు. “నా భర్త రవీంద్ర జడేజా క్రికెట్ ఆడటం కోసం లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు వెళ్లవలసి వస్తుంది. అక్కడ ఎన్ని రకాల ప్రలోభాలు ఉన్నా, ఈ రోజు వరకు ఆయన ఎప్పుడూ ఎలాంటి వ్యసనానికిలోను కాలేదు. ఎందుకంటే ఆయనకు తన బాధ్యత ఏమిటో తెలుసు” అని ఆమె అన్నారు. అయితే, ఆ వెంటనే ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “కానీ, జట్టులోని ఇతర సభ్యులు మాత్రం విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేస్తుంటారు. అయినా వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు” అని రివాబా జడేజా ఆరోపించారు.
Also Read: WTC 2025-27: WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు షాక్: ఏడో స్థానానికి పతనం!
తాను ఏ ఆటగాడి పేరు చెప్పనప్పటికీ, భారత క్రికెట్ జట్టులోని పలువురు ఆటగాళ్లు విదేశాలకు వెళ్లినప్పుడు వ్యసనాలకు పాల్పడతారనే అర్థం వచ్చేలా రివాబా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తన భర్త జడేజా దాదాపు 12 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్నా, తన నైతిక బాధ్యతను, క్రమశిక్షణను విస్మరించలేదని ఆమె పదే పదే నొక్కి చెప్పారు.
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి, ఇలాంటి సున్నితమైన అంశంపై సామూహికంగా ఆరోపణలు చేయడం సరికాదని నెటిజన్లు, ఇతర క్రికెటర్ల అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “మీ భర్త మంచితనాన్ని చాటుకోవడానికి మొత్తం జట్టును కించపరచడం తగదు” అని పలువురు సోషల్ మీడియా వేదికగా రివాబా జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యాఖ్యలు జట్టు వాతావరణంపై, ఆటగాళ్ల మనోధైర్యంపై ప్రభావం చూపుతాయేమోనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, రవీంద్ర జడేజా సతీమణి రివాబా చేసిన ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ రంగంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

