Rinku Singh Wedding

Rinku Singh Wedding: ఎంపీ ప్రియాతో రింకూ సింగ్‌ పెళ్లి తేదీ ఫిక్స్..జూన్ 8న నిశ్చితార్థం

Rinku Singh Wedding: భారత క్రికెట్‌లో తనదైన గుర్తింపు పొందిన రింకూ సింగ్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రేమికుల మనసులు దోచుకున్న రింకూ ఇప్పుడు రాజకీయ రంగంలో సత్తా చాటిన యువ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఒక్కటవనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జూన్ 8న లక్నోలోని ఓ ప్రముఖ హోటల్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఇక వివాహం నవంబర్ 18న వారణాసిలోని తాజ్ హోటల్‌లో జరగనుంది.

క్రికెట్ ఫీల్డ్ నుంచి జీవిత ఫీల్డ్ వరకు…

అలీఘర్‌లో జన్మించిన రింకూ సింగ్ సాధారణ కుటుంబంలో పెరిగాడు. అతని తండ్రి సిలిండర్ డెలివరీ పని చేసేవారు. 9వ తరగతిలో ఫెయిల్ అయిన తర్వాత విద్యను ఆపి, క్రీడల్లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. రంజీ జట్టులో అరంగేట్రం చేసిన రింకూ, 2017లో ఐపీఎల్‌లోకి ప్రవేశించాడు. 2018లో కేకేఆర్ జట్టుకు షారుక్ ఖాన్ అతన్ని రూ. 80 లక్షలకు కొనుగోలు చేశారు. ఒక్క మ్యాచ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ప్రియంగా వచ్చిన ఎంపీ…

ప్రియా సరోజ్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ తరఫున మచ్చిలిషహర్ నుంచి ఎంపీగా సేవలు అందిస్తున్నారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 26 ఏళ్ల వయసులో ఆమె గెలుపొందుతూ దేశంలో అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా గుర్తింపు పొందారు. ఆమె తండ్రి తుఫానీ సరోజ్ గతంలో మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. న్యూఢిల్లీలో విద్యను పూర్తి చేసిన ప్రియా, అమిటీ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: PBKS vs MI: వర్షం కారణంగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్ రద్దు అయితే ఫైనల్ చేరుకునే జట్టు ఇదే!

ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పెద్దలు

ప్రియా సరోజ్, రింకూ సింగ్‌ల పరిచయం రాజకీయ మరియు క్రీడా నేపథ్యం కలిగిన కుటుంబ స్నేహం ద్వారా మొదలైంది. వీరిద్దరూ తరచూ టచ్‌లో ఉండటం, మధ్యలో పరస్పరంగా అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. ఈ పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారింది. పెద్దలకు చెప్పగా, వారు సంతోషంతో అంగీకరించి, జూన్ 8న నిశ్చితార్థం, నవంబర్ 18న వివాహం జరిపించేందుకు ముహూర్తాలు ఫిక్స్ చేశారు.

ఫ్యాన్స్, నాయకుల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత, క్రికెట్ అభిమానులు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇద్దరు యువతీ, యువకుల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలవుతున్నందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *