Rice Price Hike: దేశంలో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. మరీ పండుగల వేళ పైపైకి చేరాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు సతమతం అవుతుండగా, ఇప్పుడు బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షల తొలగింపుతో ఈ ఒక్క వారంలోనే 15 శాతం ధరలు పెరిగాయి. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గతేడాది కేంద్రం పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 20 శాతానికి పెంచింది. గత నెల 28న ఇదే సుంకాన్ని 10 శాతానికి తగ్గించింది. దీంతో ఎగుమతులు జోరందుకున్నాయి. దేశంలో బియ్యం ధరలు అమాంతం పెరిగాయి.
Rice Price Hike: భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, సౌదీ అరేబియా, చైనా, యూఏఈ, ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. ఆఫ్రికాకు అధికంగా ఎగుమతి అయ్యే స్వర్ణ రకం బియ్యం ఇంతకు ముందు రూ.35 కిలో ఉండగా, ఇప్పుడు ఏకంగా 41కి పెరిగింది. అదే హైదరాబాద్‌లో కర్నూలు సోనా మసూరి బియ్యం మధ్య రకం ధర క్వింటాకు 5,824గా మార్కెట్‌లో అమ్ముతున్నారు. దీంతోపాటు మిగతా అన్ని రకాల ధరలు 10 నుంచి 15 శాతానికి పెరిగాయి.
Rice Price Hike: అంతర్జాతీయ డిమాండ్ మేరకు మన బియ్యానికి విదేశాల్లో మంచి మార్కెట్ ఉన్నది. ప్రపంచ బియ్యం మార్కెట్‌లో మన దేశం వాటా 45 శాతం వరకూ ఉంటుంది. అందుకే రానురాను బియ్యం ఎగుమతుల పెరుగుదలతో మన దేశంలోనూ బియ్యానికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు నెలల అనంతరమే వరి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. దీంతో అప్పటి దాకా బియ్యం డిమాండ్ కారణంగా ధరల తగ్గుదల ఉండకపోవచ్చు. ఆ తర్వాతే కొత్త బియ్యం దిగుబడి తర్వాత కొంతమేరకు ధరలు తగ్గే అవకాశం ఉన్నది.

