RGV

RGV: రాజమౌళికి మద్దతుగా ఆర్జీవీ సంచలన ట్వీట్

RGV: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త చిత్రం ‘వారణాసి’ ప్రారంభోత్సవ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఒక సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు, రాజమౌళి కాస్త అసహనంగా, “నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. మా నాన్న చెప్పినట్లు హనుమంతుడు నడిపిస్తే ఇదేనా నడిపించడం?” అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు హిందూ సంఘాలు, పలువురు రాజకీయ నాయకులను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వివాదంపై స్పందించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో రాజమౌళికి బలంగా మద్దతు తెలుపుతూ, విమర్శకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

రాజమౌళి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై విషం చిమ్ముతున్న వారిని ఉద్దేశిస్తూ ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు. రాజమౌళికి కూడా తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని, నాస్తికుడిగా ఉండడం భారతదేశంలో నేరం కాదనే విషయాన్ని విమర్శకులు తెలుసుకోవాలని ఆర్జీవీ స్పష్టం చేశారు.

ఆర్జీవీ తన ట్వీట్‌లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 గురించి ప్రస్తావించారు. “తాము దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు భక్తులకు ఎంత ఉందో, తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు రాజమౌళికి కూడా అంతే ఉంది” అని ఆయన బలంగా చెప్పారు.

Also Read: Deekshit shetty: రష్మిక మందన్న వ్యక్తిగత జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో

రాజమౌళి దేవుడిని నమ్మకపోతే, ఆయన సినిమాల్లో దేవుడి పాత్రలు లేదా కథలు ఎందుకు చూపిస్తున్నారు? అని కొందరు చేస్తున్న వాదనను ఆర్జీవీ మూర్ఖపు వాదనగా కొట్టిపారేశారు. “ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమా తీయడానికి ముందు గ్యాంగ్‌స్టర్‌గా మారాలా? లేదా హారర్ సినిమా కోసం దెయ్యం అవ్వాలా?” అంటూ ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. సినిమా అనేది కేవలం కథాంశం మాత్రమేనని, వ్యక్తిగత నమ్మకాలతో దానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

రాజమౌళిని విమర్శించే వారికి నిజమైన సమస్య ఏమిటో ఆర్జీవీ సంచలనంగా వెల్లడించారు. “రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా, చాలా మంది విశ్వాసులు తమ జీవితాల్లో కూడా చూడనంత విజయాన్ని, సంపదను దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుడ్ని నమ్ముతూ కూడా వైఫల్యం చెందినవారు దీన్ని జీర్ణించుకోలేక అసూయతో రగిలిపోతున్నారు. అందుకే దేవుడిని సమర్థించే ముసుగులో విషం కక్కుతున్నారు” అని వర్మ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

“దేవుడు ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు అని నోట్‌ప్యాడ్ పట్టుకుని కూర్చోడు. రాజమౌళి నాస్తికుడైనంత మాత్రాన దేవుడి శక్తి తగ్గదు. దేవుడు బాగానే ఉన్నాడు… రాజమౌళి కూడా బాగానే ఉన్నాడు… ఈ ఇద్దరినీ అర్థం చేసుకోలేని వారే ఇబ్బంది పడుతున్నారు” అని ఆర్జీవీ తన ట్వీట్‌ను ముగించారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్ కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *