Revanth Cabinet Plans: రేవంత్ క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేస్తూ.. ఖాళీ బెర్తుల్ని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు కూడా పూర్తి చేసింది. ఇక ఉగాది రోజు శుభవార్త వింటామని ఆశావహులు ఎంతో ఉత్కంఠగా ఎదరుచూశారు. అయితే ఉగాది వెళ్లిపోయింది. ఫైనల్ లిస్టు మాత్రం విడుదల కాలేదు. తాజాగా క్యాబినెట్ విస్తరణలో కొత్త ట్విస్టులంటూ లీకులిస్తున్నారు. ఇక రేవంత్ క్యాబినెట్‌లో ప్రస్తుతం ఉన్న ఓ ఇద్దరు మంత్రులకు ఎక్జిట్ డోర్ తెరవబోతున్నారనీ, గ్రాఫ్ ఆధారంగా ఒకర్ని, వివాదల కారణంగా మరొకర్ని మంత్రి వర్గం నుండి రిలీవ్ చేస్తున్నారని కూడా గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ అంశంలోనూ అధిష్టానం యూటర్న్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా కొత్త ట్విస్టులు? ఎవరా ఇద్దరు మంత్రులు? హైకమాండ్ యూటర్న్‌కి కారణాలేంటి? కీప్ వాచ్ దిస్ స్టోరీ.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఎపిసోడ్ మలుపులమీద మలుపులు తిరుగుతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ.. బీసీ, ఎస్సీ సామాజికవర్గాలకు విస్తరణలో క్యాబినెట్ బెర్తులు కేటాయించారంటూ పెద్ద ఎత్తున లీకులు వినిపించాయి. అయితే అనూహ్యంగా మంత్రివర్గ విస్తరణ మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, కులగణన ప్రకారం.. తమకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ పలు సామాజికవర్గాలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా బీసీ, రెడ్డి సామాజికవర్గాలకు మంత్రి పదవులంటూ లీకులు అందుతున్నాయి. ఇప్పటివరకూ క్యాబినెట్ ప్రాధాన్యత లేని సెగ్మెంట్ల నేతలు కూడా హైకమాండ్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.
ఉగాదికి తీపి కబురు అందుతుందనుకున్న నేతలు ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో మార్పులు చోటు చేసుకున్నట్లు వస్తున్న వార్తలతో ఉసూరుమనాల్సి వస్తోంది. క్యాబినెట్‌పై క్లారిటీ రావాలంటే ఈ నెల 10 వరకు వేచిచూడక తప్పదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే హైకమాండ్ చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతూ… అగ్రనేతలకు లేఖలు రాస్తుంటే… తమకు ఇచ్చిన హామీ సంగతేంటని మరికొందరు నేతలు నిలదీస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో హైకమాండ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ తుది నిర్ణయం తర్వాత ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక ఉగాదికి ముహూర్తం ఖరారైంది అనుకున్న క్యాబినెట్ విస్తరణ మరింత ఆలస్యం అవడానికి ఆ ఇద్దరు మంత్రుల అంశమే కారణమని కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరు మంత్రుల మంత్రి పదవులపై మొన్నటి దాకా ఒక రకంగా చర్చ జరిగితే, తాజాగా ఆ చర్చ యూ టర్న్ తీసుకుని మరోరకంగా చర్చ నడుస్తోందట. ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు జూపల్లి కృష్ణారావు కాగా, మరొకరు కొండా సురేఖ. వీరిద్దరి చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఆరోపణల కారణంగా మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేస్తారని నిన్నటి దాకా పెద్దఎత్తున ఊహాగానాలు నడిస్తే.. వారిద్దర్నీ కొనసాగించేందుకు సీఎం రేవంత్ పట్టుబడుతుండటం వల్లే.. క్లైమాక్స్‌లో విస్తరణ వాయిదా పడినట్లు తాజాగా లీకులొస్తున్నాయి.
మంత్రి కొండా సురేఖ చుట్టూ నడిచిన వివాదాలు అందరికీ తెలిసిందే. ఆమె తన దురుసు ప్రవర్తనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారన్న విమర్శలున్నాయి. విపక్ష నేతలపై, సినీనటులపై, ఇతర రాజకీయ నాయకులపై ఆమె చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. వరంగల్ జిల్లాలో ఆమె జోక్యం పార్టీలో వర్గపోరు కారణమవుతోందన్న ఆరోపణలున్నాయి. ఇక జూపల్లి కృష్ణారావు సీనియర్ నేతగా మంత్రిపదవి పొందినప్పటికీ, తన శాఖను సమర్థంగా నిర్వహించలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేలతో ఆయనకు సమన్వయం లేదని చెప్తున్నారు. ఇక యూబీ గ్రూప్ విషయంలో సంబంధిత సమస్యలను సరిగా పరిష్కరించలేదన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
ఇది కూడా చదవండి: April Bank Holidays: ఏప్రిల్ లో 11 రోజులు బ్యాంకులు బండ్.. సెలువు లిస్ట్ ఇదే!
ఆ మధ్య సీఎం కేటీఆర్ అని సంభోదించి ఇరుకున పడ్డారు జూపల్లి. కేటీఆర్ కూడా దీనిపై స్పందించి ఇక నీ మంత్రి పదవికి గండం ఉంది చూసుకో జర జాగ్రత్త అని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు మంత్రులపై హైకమాండ్‌కు కట్టలు కట్టలుగా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఇక సినీనటి సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో హీరో నాగార్జున ఫ్యామిలీ ఏకంగా ఢిల్లీ హైకమాండ్‌కే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరిపై వేటుకు హై కమాండ్ సిద్ధమైనప్పటికీ.. సీఎం రేవంత్ హైకమాండ్‌తో వారిస్తూ… వారిని కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు, ఈ విషయంలోనే విస్తరణకు బ్రేక్ పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ.. ఇద్దరి విషయంలోనూ ఇటు పార్టీ పరంగానూ, అటు పాలన పరంగానూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్నప్పటికీ.. రేవంత్ వారిని కొనసాగించేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు ఇటీవల రేవంత్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని చెబుతున్నారు విశ్లేషకులు. పాలనపై పట్టు రావడమంటే.. ఇద్దరు మంత్రులను తొలగించడమో, ఇద్దరు అధికారులను జైలుకు పంపడమో కాదని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అందరినీ సమన్వయం చేసుకుని… మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్లు అని, దానికి కొంత సమయం పడుతుందని కూడా చెప్పారు.
ఈ వ్యాఖ్యలు జూపల్లి, సురేఖల మంత్రి పదవులను ఉద్దేశించి చేసినవిగానే పరిశీలకులు భావిస్తున్నారు. రేవంత్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలకు కొండా సురేఖ కొండంత అండగా నిలబడ్డారు. ఆ క్రమంలోనే ఆమె అక్కినేని ఫ్యామిలీతో సైతం గొడవపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జూపల్లి కృష్ణారావు సీనియర్ మంత్రి. జూపల్లిని మంత్రి పదవి నుండి తొలగిస్తే… కేటీఆర్ అన్న మాటలు నిజం చేసినట్లేనని, అప్పుడు బీఆర్‌ఎస్ చేతికి తామే ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుందని కూడా రేవంత్ భావిస్తూ ఉండవచ్చునంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. 16 నెలలు కూడా పరిపాలన పూర్తి కాకుండా… అప్పుడే ఒకరిద్దరు మంత్రుల్ని తొలగిస్తే… పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ డిస్టబెన్సెస్ తలెత్తే అవకాశం ఉందన్నదే రేవంత్ అభిమతం అయ్యిండొచ్చని చెప్తున్నారు. ఈ పరిణామాల వల్లే ఉగాదికి పెట్టుకున్న క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కాస్తా.. మరో పది రోజుల పాటు వాయిదా పడినట్లు విశ్లేషిస్తున్నారు.