Ram Suthar: భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన దిగ్గజ శిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్ వాంజీ సుతార్ ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, నోయిడాలోని తన కుమారుడి నివాసంలో వందేళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అనిల్ సుతార్ అధికారికంగా ధృవీకరించారు. 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూర్ గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన రామ్ సుతార్, శిల్పకళా రంగంలో అద్భుతమైన శిఖరాలను అధిరోహించారు. తన జీవితకాలంలో ఆయన రూపొందించిన విగ్రహాలు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు సృష్టించిన గుజరాత్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) రామ్ సుతార్ మేధస్సు నుండి పుట్టిన అద్భుత కళాఖండం. సుమారు 182 మీటర్ల ఎత్తుతో నిర్మితమైన ఈ విగ్రహం ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టింది. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన కొలువుదీరిన 125 అడుగుల భారీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయనే తీర్చిదిద్దారు. ఈ భారీ విగ్రహాన్ని 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడితో అత్యంత నాణ్యంగా నిర్మించారు. భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంగా ఇది చరిత్రకెక్కింది.
Also Read: Hurun India Report 2025: ప్రపంచ సంపన్న కుటుంబాల్లో నంబర్ వన్ దీపిందర్ గోయల్..!
రామ్ సుతార్ శిల్పకళా నైపుణ్యాన్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం 1999లో ‘పద్మశ్రీ’, 2016లో ‘పద్మభూషణ్’ పురస్కారాలతో ఆయనను సత్కరించింది. పటేల్, అంబేద్కర్ విగ్రహాలే కాకుండా దేశవ్యాప్తంగా వందలాది స్మారక చిహ్నాలను ఆయన రూపొందించారు. కేవలం ఒక కళాకారుడిగానే కాకుండా, భారతీయ సంస్కృతిని విగ్రహాల రూపంలో భావితరాలకు అందించిన మహనీయుడిగా ఆయన పేరు నిలిచిపోతుంది. వందేళ్ల నిండు జీవితాన్ని గడిపిన ఈ మహా శిల్పి మరణం పట్ల రాజకీయ, కళా, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

