Telangana: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఫేక్ వీడియో సృష్టించారని తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) దాఖలు చేసిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనపై ఒక ఫేక్ వీడియోను సృష్టించి విస్తృతంగా ప్రచారం చేశారని తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలతో పాటు మరికొందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు ధర్మాసనం గుర్తించింది. తగిన ఆధారాలు లభ్యం కాకపోవడంతో కేటీఆర్, జగదీష్ రెడ్డిలపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ నాయకులకు ఊరట లభించినట్లయింది.