Ramdev baba: కేరళలోని పాలక్కాడ్ కోర్టు ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, అలాగే సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
దివ్య ఫార్మసీ వైద్య విధానాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో, కేరళ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఈ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాల్సిందిగా కోర్టు నోటీసులు పంపినా, ఫిబ్రవరి 1న జరిగిన విచారణకు రాందేవ్ బాబా, బాలకృష్ణ హాజరుకాలేదు. దీంతో కోర్టు వారిపై ధిక్కరణ చర్యలు తీసుకుంటూ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
అంతేకాక, ప్రజలను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల కారణంగా, పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తులపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. అంతేకాదు, వాటి తయారీ లైసెన్స్‌లను కూడా రద్దు చేసింది.
ఈ తాజా పరిణామాలపై పతంజలి సంస్థ సీఈవో రాందేవ్ బాబా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. తదుపరి విచారణ ఫిబ్రవరి 15కి వాయిదా పడింది.

