Rajya Sabha: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ఉజ్వల్ దేవరావు నికమ్, సి. సదానందన్ మాస్టర్, హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, డాక్టర్ మీనాక్షి జైన్ లను పెద్దల సభకు నామినేట్ చేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం సంక్రమించిన అధికారాలతో రాష్ట్రపతి ఈ నియామకాలు చేశారు. గతంలో నామినేట్ చేయబడిన సభ్యుల పదవీ విరమణ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ చర్య తీసుకున్నారు.
రాజ్యసభకు ఎంపికైనవారు వీరే:
ఉజ్వల్ దేవరావు నికమ్: ముంబై 26/11 ఉగ్రవాద దాడుల కేసుతో సహా అనేక కీలకమైన క్రిమినల్ కేసులలో ప్రభుత్వ పక్షాన వాదించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈయన. కసబ్‌కు ఉరిశిక్ష పడేలా వాదనలు వినిపించడంలో ఆయన కృషి గణనీయం.
సి. సదానందన్ మాస్టర్: కేరళకు చెందిన గౌరవనీయ సామాజిక కార్యకర్త, విద్యావేత్త. దశాబ్దాలుగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సేవలు అందించారు. ప్రధాని మోదీ సదానందన్ మాస్టర్‌ను ప్రశంసిస్తూ, ఆయన జీవితం అన్యాయానికి తలొగ్గడానికి నిరాకరించే ధైర్యం యొక్క ప్రతిరూపమని, యువత సాధికారత పట్ల ఆయనకు అత్యంత మక్కువ ఉందని ట్వీట్ చేశారు.
హర్ష్ వర్ధన్ ష్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి. కీలకమైన అంతర్జాతీయ బాధ్యతలు నిర్వహించిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా ఆయనకు పేరుంది.
డాక్టర్ మీనాక్షి జైన్: ప్రసిద్ధ చరిత్రకారిణి, విద్యావేత్త. భారతీయ చారిత్రక విజ్ఞానానికి ఆమె చేసిన కృషికి గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ డాక్టర్ మీనాక్షి జైన్‌ను అభినందిస్తూ, ఆమె పండితురాలిగా, పరిశోధకురాలిగా, చరిత్రకారిణిగా ఒక ప్రత్యేకతను చాటుకున్నారని, విద్య, సాహిత్యం, చరిత్ర, రాజకీయ శాస్త్ర రంగాలలో ఆమె కృషి విద్యాపరమైన చర్చను సుసంపన్నం చేసిందని కొనియాడారు.
Also Read: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు వారే కారణం.. తేల్చిన జ్యుడీషియల్ కమిషన్
సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ వంటి రంగాలలో విశేష సేవలు అందించిన 12 మంది ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం నలుగురి పదవీకాలం ముగియడంతో ఆ స్థానాలను భర్తీ చేశారు. ఈ నూతన సభ్యుల నియామకం ద్వారా రాజ్యసభ మరింత జ్ఞానం అనుభవంతో సుసంపన్నం అవుతుందని భావిస్తున్నారు.
The President of India has nominated Ujjwal Deorao Nikam, a renowned public prosecutor known for handling high-profile criminal cases; C. Sadanandan Maste, a veteran social worker and educationist from Kerala; Harsh Vardhan Shringla, former Foreign Secretary of India; and… pic.twitter.com/eN6ga5CsPw
— ANI (@ANI) July 13, 2025


