Rajanna Sircilla: బాధలు పెడితే, బంధనాలు విధిస్తే, వివక్ష చూపితే, అధికార దర్పం ప్రదర్శిస్తే.. ఓ అధికారిపై ప్రజలు విరక్తి చెందుతారు. ఆ అధికారి పీడ వదిలితే సంబురాలే చేసుకుంటారు. కొందరు మొక్కలు తీర్చుకుంటారు. టపాసులు పేలుస్తారు. స్వీట్లు పంచుకుంటారు. తాజాగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారు. ఆయన వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయో కానీ, ప్రజలు మాత్రం సంబురమే చేసుకున్నారు.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఈ విషయం తెలియడంతో సిరిసిల్ల పట్టణ ప్రజలు పలువురు స్థానిక అభయాంజనేయ స్వామి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. టపాసులు పేల్చారు. సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తామని చెప్పారు. పలువురు బాధితులు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ వివాదాస్పదుడిగా పేరున్నది. పలు విషయాల్లో ఆయన తీరుపై ప్రజల నుంచి తీవ్ర విస్మయం వ్యక్తమైంది. తొలినాళ్ల నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని వేధింపులకు గురిచేశారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏకంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ ఫొటో ఉన్నదన్న కారణంతో ఓ టీస్టాల్ తొలగింపునకు ఆదేశాలు జారీచేశారని పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ తర్వాత పలు అంశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆ పార్టీ ముఖ్య నేతలే ఆరోపించారు.
Rajanna Sircilla: ఇదిలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపైనా కలెక్టర్ ఝూ అదే వైఖరి ప్రదర్శించారని ఆ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఏకంగా ప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలెక్టర్‌కు వివాదం ఏర్పడింది. ఆయన ఇటీవల పాల్గొన్న ప్రజాపాలన వేడుకలకు కలెక్టర్ ఆలస్యంగా పాల్గొనడం వివాదానికి తావిచ్చింది.
Rajanna Sircilla: మరో అంశంపైనా సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఉన్న సందీప్ కుమార్ ఝూపై ఇటీవలే హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఆయన బాడీ లాంగ్వేజ్, వేషధారణపైనా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఆయన వైఖరి మారక పోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆయన తీరుపై సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలను జారీ చేసింది. ఆయా అంశాలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజా బదిలీల్లో భాగంగా ఆయనపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో కలెక్టర్‌గా ఎం హరిత నియామకం అయ్యారు.