Rajanna Sircilla

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్లలో విషాదం.. గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ అర్బన్ మండలం, చింతల్‌ఠానా గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ప్రజా సేవ చేయాలన్న తపనతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి గెలుపు అంచల్లో ఉండగానే అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా, హోరాహోరీగా తన ప్రచారాన్ని నిర్వహించిన మురళి, గ్రామ అభివృద్ధికి ఎన్నో కలలు కన్నారు. గ్రామానికి మంచి చేయాలని, ప్రజలకు సేవ చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్న ఈ యువ నాయకుడు హఠాత్తుగా కుప్పకూలడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆయన మృతితో గ్రామస్థులు, పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఇక, తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 4,236 గ్రామాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా, చివరకు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ, బుజ్జగింపుల తర్వాత రాష్ట్రంలో మొత్తం 395 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో వికారాబాద్ జిల్లా అత్యధికంగా 39 గ్రామాలను ఏకగ్రీవం చేసుకొని మొదటి స్థానంలో నిలవగా, ఆదిలాబాద్ జిల్లా 33 ఏకగ్రీవాలతో రెండో స్థానంలో ఉంది.

అయితే, కొన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కేవలం 3 గ్రామాలు మాత్రమే ఏకగ్రీవం కాగా, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చెరో 4 గ్రామాలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు, రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. ఈ గ్రామాల భవితవ్యంపై ఎన్నికల కమిషన్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మొత్తం మీద, మొదటి విడతలో 3,836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం 13,127 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే, మొత్తం 37,440 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 27,960 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *