Raj Gopal Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం నేరుగా జిల్లా పర్యటనలో పాల్గొన్న ఆయన, కొల్లాపూర్ మండలం జటప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ, “2034 వరకు ఈ పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు గడ్డ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు” అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోనే చర్చకు దారి తీశాయి.
ఇది కూడా చదవండి: AP Liquor Scam: ఏ క్షణమైనా మిథున్‌రెడ్డి అరెస్టు!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ సంచలనం
రేవంత్ వ్యాఖ్యలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేస్తూ తీవ్రంగా స్పందించారు. ఆయన ట్వీట్‌లో,
“రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎంపిక అవుతాడు. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చే ప్రయత్నాలను నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు” అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో, కోమటిరెడ్డి ట్వీట్ మరింత రాజకీయ కలకలం రేపింది.


