Rahul Sipligunj Wedding: టాలీవుడ్ లో మరో పెళ్లి జరగనుంది ప్రముఖ గాయకుడు, ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ సందర్భంగా తన వివాహానికి హాజరు కావాలని కోరుతూ, కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి ఆయన మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
సీఎంకు శుభలేఖ అందజేత
రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి దంపతులు తమ వివాహ శుభలేఖను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి, ఆశీస్సులు తీసుకున్నారు.ఈ నెల 27వ తేదీన రాహుల్, హరిణ్యల వివాహం జరగనుంది. వీరి నిశ్చితార్థం గత ఆగస్టు నెలలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. రాహుల్ వివాహం చేసుకోబోయే హరిణ్య రెడ్డి, టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె.
ఇది కూడా చదవండి: Babar Azam: 907 రోజుల తర్వాత సెంచరీ.. ఫీజులో 10 శాతం జరిమానా విధించినట్లు ఐసిసి
ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వరకు..
రాహుల్ సిప్లిగంజ్ సాధించిన విజయాలను సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రశంసించారు. ఇటీవల జరిగిన ‘గద్దర్’ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్‌ను ఉద్దేశించి “ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వరకూ వెళ్లిన కుర్రాడు” అంటూ ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని సంచలనం సృష్టించిన ‘నాటు నాటు’ పాటకు కాలభైరవతో కలిసి రాహుల్ ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. అనేక సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న రాహుల్, ‘రంగమార్తాండ’ చిత్రంతో నటుడిగానూ గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వార్తతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

