Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన, సోషల్ మీడియాలో తన స్పష్టమైన అభిప్రాయాలతో తరచూ చర్చనీయాంశమవుతుంటారు. తాజాగా వరుసగా చేసిన ట్వీట్స్‌తో రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారారు.
రాజకీయ నేతలను టార్గెట్ చేసిన ట్వీట్స్
రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో వరుస పోస్టులు చేస్తూ తెలంగాణ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలను నేరుగా ట్యాగ్ చేశారు.
“మనమిప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
“నేను విసిగిపోయాను… నన్ను చంపేయండి” అంటూ కేసీఆర్‌కు ట్వీట్ చేశారు.
“హైదరాబాద్ మునిగిపోయింది, హామీలు విఫలమయ్యాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు” అంటూ మరో ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్స్ కేవలం కొన్ని గంటల్లోనే వైరల్ అవ్వడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను నేరుగా ట్యాగ్ చేయడం విశేషంగా మారింది.
ఇది కూడా చదవండి: Rabis Deaths: ప్రపంచాన్ని వణికిస్తున్న రేబిస్ వ్యాధి.. 9 నిమిషాలకు ఒకరి మరణం.. ఏపీలో తాజాగా ఒకరి మృతి
గాంధీపై వ్యాఖ్య – కొత్త వివాదం
అంతటితో ఆగకుండా, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రాహుల్ రామకృష్ణ “గాంధీ సాధువు కాదు, ఆయన మహాత్ముడే కాడు” అంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజిక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
గతంలోనూ వివాదాలు
ఇలా ట్వీట్ లు వెయ్యడం ఇదే తొలిసారి కాదు.
రైలు ప్రమాదంపై వ్యాఖ్యలు,
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు,
అలాగే పలు సున్నితమైన విషయాలపై చేసిన పోస్టులు ఆయనను తరచూ వివాదాల్లోకి నెట్టాయి.
కొన్నిసార్లు ప్రభుత్వ ఒత్తిడి కారణంగా తన ట్వీట్స్‌ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని కూడా సమాచారం.
అకౌంట్ డిలీట్ – ఆసక్తికర ట్విస్ట్
ఈ సారి చేసిన వరుస ట్వీట్స్ మరింత దూకుడుగా ఉండటంతో, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయడం ఇప్పుడు కొత్త చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకు ఆ పోస్టులు పెట్టారు? తర్వాత వెంటనే ఎందుకు ఖాతా తొలగించారు? అనే ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి.