Rahul Gandhi: భారత్–పాకిస్థాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఆదివారం వేర్వేరుగా ప్రధానికి లేఖలు రాశారు.
కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాలోనే ఈ డిమాండ్ రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందాన్ని మొదటగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారన్న విషయాన్ని రాహుల్ తన లేఖలో ప్రస్తావించారు.
రాహుల్ గాంధీ లేఖలో ఇలా తెలిపారు:
“ప్రియమైన ప్రధానమంత్రి గారూ, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుగా వెల్లడించిన కాల్పుల విరమణ ఒప్పందం వంటి అంశాలపై పార్లమెంట్‌లో చర్చ అవసరం. ప్రజాప్రతినిధులుగా ఈ అంశాలపై చర్చించటం ప్రజల న్యాయమైన ఆశ. రాబోయే సవాళ్లను ఎదుర్కొనడంలో సామూహిక సంకల్పం ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశం. మీరు ఈ డిమాండ్‌ను తీవ్రంగా పరిగణిస్తారని ఆశిస్తున్నాను.”
మరోవైపు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ఇలాంటి లేఖే పంపారు. “గత ఏప్రిల్ 28న పహల్గామ్ దాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు నేను కోరిన సంగతి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా—పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్, అమెరికా ద్వారా మొదలై భారత్, పాకిస్థాన్‌ల ప్రకటనల ద్వారా వెలువడిన కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు అవసరం. ప్రతిపక్షాల ఏకగ్రీవ అభ్యర్థనకు నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను,” అని ఖర్గే పేర్కొన్నారు.
ఇదిలావుండగా, శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం, ఇరు దేశాలు తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అంగీకరించాయని తెలిపారు. ట్రంప్, “ఇది ఒక శాంతియుత ముందడుగు. ఇరు దేశాలు చూపిన విజ్ఞత అభినందనీయం,” అని ‘ట్రూత్ సోషల్’లో తెలిపారు.
అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించి, ఇరు దేశాల నేతలను అభినందించారు. అయితే, భారత ప్రభుత్వ ప్రకటనలో ఎక్కడా ట్రంప్ పేరును గానీ, అమెరికా పాత్రను గానీ ప్రస్తావించకపోవడం గమనార్హం.