Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
అధికారిక షెడ్యూల్ ప్రకారం, రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ సుమారు రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుంటారు.
సాయంత్రం 7:15 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి బయల్దేరి 7:55 గంటలకు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ నిర్వహిస్తున్న ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ కార్యక్రమంలో భాగంగా అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జట్టు, సీఎం రేవంత్‌రెడ్డి జట్టు మధ్య జరుగుతున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను రాహుల్ గాంధీ వీక్షించనున్నారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ రాత్రి 9:15 తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
Also Read: KTR: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం
ఇదే సమయంలో ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం, ఈ మ్యాచ్‌కు సుమారు 2,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
మ్యాచ్ వీక్షించేందుకు టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియానికి రావాలని పోలీసులు సూచించారు. వాహనాల కోసం 34 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారులు, ప్రముఖులు పాల్గొంటున్న కార్యక్రమం కావడంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.

