R.krishnaiah: ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, హర్యాణా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను కమలం పార్టీ సోమవారం ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మళ్లీ రాజ్యసభ పదవి వరించడంతో ఆర్ కృష్ణయ్యకు బీసీ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవీకాలం మరో నాలుగేండ్లపాటు ఉండగానే తన పదవికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనేక బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బీసీల రిజర్వేషన్లు, వారి అభివృద్ధి కోసం అనేక పోరాటాలు నిర్వహించారు.