Putin: రాష్ట్రపతి భవన్ లో జరిగిన ద్వైపాక్షిక సమావేశాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఇచ్చిన ఆతిథ్యం ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో అనేక కీలక అంశాలపై ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు పుతిన్ వెల్లడించారు.
ప్రస్తుతం భారత్–రష్యా మధ్య వాణిజ్య పరిమాణం 64 బిలియన్ డాలర్లుగా ఉందని, 2030 నాటికి దీన్ని 100 బిలియన్ డాలర్లకు చేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి రెండు దేశాలు అంగీకరించాయని చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక అభివృద్ధి, పరిశోధన రంగాల్లో పరస్పరం సహకారం కొనసాగుతుందన్నారు.
భారత్ ఇంధన అవసరాలను తీర్చేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ తెలిపారు. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన నిర్మాణ, సాంకేతిక సహకారాన్ని రష్యా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే వైద్య మరియు ఆరోగ్య రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేసే అవకాశాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి రష్యా సంపూర్ణ మద్దతు ఇస్తుందని పుతిన్ తెలిపారు. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షతన జరగబోయే బ్రిక్స్ సమావేశాన్ని రష్యా పూర్తిగా సమర్థిస్తుందని, సహకరిస్తుందని కూడా ఆయన అన్నారు.

