Puri Jaganath: ఒకప్పుడు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, తాజాగా తన పాత జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమా విడుదలైన రోజున, అభిమానిగా తాను స్వయంగా గీసిన చిరంజీవి చిత్రాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రం ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
చిరంజీవిపై పూరి జగన్నాథ్‌కు ఉన్న అభిమానం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. తన పాత డైరీని చూస్తున్నప్పుడు ‘ఖైదీ’ సినిమా విడుదలైన రోజున తాను గీసిన 60/40 సైజు ఫోటో దొరికిందని పూరి తెలిపారు. ఆ ఫోటోను థియేటర్ వద్ద డిస్ప్లేలో ఉంచానని, ఆ అభిమాని మరెవరో కాదు, తానేనని ఆయన వివరించారు. పూరి జగన్నాథ్ చిరంజీవిని చూసి స్ఫూర్తి పొంది సినీ పరిశ్రమలోకి వచ్చానని గతంలో ఎన్నోసార్లు చెప్పారు.
Also Read: Akira Nandan: ఓజీకి అకిరా స్వరాలు.. యువ ప్రతిభకు ఫిదా అయిన థమన్
చిరంజీవితో సినిమా కల..
చిరంజీవితో సినిమా చేయాలనేది పూరి జగన్నాథ్‌కు ఎప్పటినుంచో ఉన్న కల. గతంలో ‘ఆటో జానీ’ అనే మాస్ కథను కూడా ఆయన సిద్ధం చేశారు. అయితే, ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కానీ, చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ఓ సన్నివేశంలో పూరి నటించారు. ఇటీవల పూరి, ఛార్మి తమ కొత్త సినిమా పని మీద చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు, చిరంజీవి వారి సినిమా విజయం సాధించాలని ఆశీర్వదించారు. చిరంజీవికి ఉన్న ప్రపంచవ్యాప్త అభిమానుల జాబితాలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఉన్నారని ఈ పోస్ట్ మరోసారి నిరూపించింది.