Pinarayi Vijayan: కేరళ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జరిపిన సోదాలు తీవ్ర కలకలం రేపాయి. కన్నూర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తనిఖీలు ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో.. అక్కడ ఉన్న సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో విజయన్ నివాసం వద్ద భారీ ఎత్తున ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈడీ సోదాలు ముగిసిన తర్వాత అధికారులు కార్లలో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో గుమిగూడిన పార్టీ కార్యకర్తలు గేటు వద్దే అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీ సంస్థకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు తోపులాట, గందరగోళ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు రంగంలోకి దిగి, కార్యకర్తలను శాంతింపజేసి అధికారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, కొందరు ఆగ్రహం తట్టుకోలేక ఈడీ అధికారుల కార్లపై రాళ్లు రువ్వారు.
ఈ సోదాలపై సీపీఐ(ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి తీవ్రంగా స్పందించారు. పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్న ఈడీని వాడుకుని రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకులను భయపెట్టడమే కేంద్రం ముఖ్య ఉద్దేశమని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రులపై ఇలాగే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కేరళలో జరుగుతున్న ఈడీ సోదాలు కూడా బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్‌ల రాజకీయ వ్యూహంలో భాగమేనని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థలా పనిచేయడం లేదని, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ చెప్పినట్లు వినే ఒక రాజకీయ యంత్రాంగంగా మారిపోయిందని బేబి విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈడీ సోదాల వార్త తెలియడంతో కేరళ వ్యాప్తంగా సీపీఐ(ఎం) కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనితో రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తును పెంచారు.
