Telangana: హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం (మే 27) నాడు తీవ్ర ఘర్షణకు వేదికైంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నేతలు-కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ సమక్షంలో ఒక ముఖ్యమైన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశం ప్రశాంతంగా సాగాల్సింది పోయి, నేతల మధ్య గొడవతో పూర్తిగా రసాభాసగా మారింది.
సమావేశం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నియోజకవర్గ నాయకుడు ఉస్మాన్ అల్ హజారీ మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం మొదలైంది. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే సీటు విషయంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఒకరినొకరు దూషించుకుంటూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఉస్మాన్ అల్ హజారీ ఒక్కసారిగా లక్ష్మణ గీత దాటి ఫిరోజ్ ఖాన్ చెంపపై కొట్టి, వెనక్కి తోసేశారు. ఉస్మాన్ బలంగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు.
సమీక్షా సమావేశంలో మంత్రుల ముందే ఈ దారుణ సంఘటన జరగడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వెంటనే స్పందించి గొడవను ఆపేందుకు ఇద్దరి మధ్యలోకి వచ్చారు. అయితే, ఆగ్రహంతో ఊగిపోతున్న ఉస్మాన్.. వీహెచ్‌ను కూడా తోసేసే ప్రయత్నం చేయడంతో, అక్కడే ఉన్న ఇతర కార్యకర్తలు వెంటనే స్పందించి ఉస్మాన్‌ను పక్కకు లాగేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ కళ్లముందే ఈ బాహాబాహీ జరగడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.
ఈ గొడవతో గాంధీభవన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నేతలు ఇలా మంత్రుల ముందే కొట్టుకోవడంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ఆ సమీక్షా సమావేశాన్ని మధ్యలోనే అర్థాంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ కార్యాలయంలో, అది కూడా బాధ్యతగల మంత్రుల సమక్షంలోనే సీనియర్ నేతలు ఇలా వీధి రౌడీల్లా కొట్టుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనా క్రమంపై అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
