Ashada Masam 2026: సనాతన హిందూ సంప్రదాయంలో చాంద్రమానాల ప్రకారం ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ఆయా మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే, ఆ నక్షత్రం పేరే ఆ నెలకు వస్తుంది. ఆషాఢ నక్షత్రంతో (పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ) కూడిన పౌర్ణమి వచ్చే నెలనే ‘ఆషాఢ మాసం’ అంటారు. సంస్కృతంలో ‘ఆషాఢ’ అంటే ‘అజేయమైనది’ (ఎవరూ ఓడించలేనిది) అని అర్థం. అందుకే ఈ మాసాన్ని విజయానికి, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా పెద్దలు భావిస్తారు.
ఆషాఢ మాసం (Ashada Masam 2026) గురించి ప్రజల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సందేహాలు, వాటి వెనుక ఉన్న అసలు నిజాలను సరళమైన మాటల్లో కింద చూద్దాం:
1. ఆషాఢం చెడ్డ మాసమా? ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభం?
చాలామంది ఆషాఢాన్ని ఒక అశుభ మాసంగా భావిస్తారు, కానీ అది ముమ్మాటికీ తప్పు. తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం తర్వాత వచ్చే నాలుగో నెల ఇది. 2026లో ఈ ఆషాఢ మాసం జులై 15న ప్రారంభమై, ఆగస్టు 12న చుక్కల అమావాస్యతో ముగుస్తుంది.
ఈ నెలలోనే జగన్నాథ రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపౌర్ణిమ, చాతుర్మాస్య వ్రతం, తెలంగాణలో బోనాల (మహంకాళి) జాతర వంటి ఎన్నో గొప్ప పండుగలు వస్తాయి. కాబట్టి ఇది చెడ్డ నెల కాదు. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మిథునరాశిలో ఉన్నప్పుడు దీనిని ‘శూన్యమాసం’ అంటారు. శూన్యం అంటే చెడు అని కాదు. కేవలం పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు మాత్రమే ఈ కాలంలో చేయకూడదని శాస్త్రం చెబుతోంది. దేవుడి పూజలు, జపాలు, వ్రతాలకు ఇది అత్యంత పవిత్రమైన నెల. పూర్వకాలంలో వర్షాల వల్ల ప్రయాణాలు కష్టంగా ఉండటం, రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండటం వల్ల శుభకార్యాలకు విరామం ఇచ్చారంతే.
2. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఒక గొప్ప ఆయుర్వేద మరియు ఆరోగ్య రహస్యం ఉంది. ఆయుర్వేదంలో గోరింటాకును ‘మదయంతిక’ అంటారు. ఇది ఒంట్లోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. వర్షాకాలం ప్రారంభంలో చేతులు, కాళ్లు బురదలో, నీళ్లలో ఎక్కువగా నానడం వల్ల ఇన్ఫెక్షన్లు, గోరుచుట్టు వంటి సమస్యలు వస్తాయి. గోరింటాకులో ఉండే ఔషధ గుణాలు ఈ ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని కాపాడతాయి. స్త్రీలు దీనిని సౌభాగ్యానికి ప్రతీకగా కూడా భావిస్తారు.
3. కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టొచ్చా?
కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదని ధర్మశాస్త్రాల్లో ఎక్కడా ప్రత్యేకంగా రూల్ లేదు. అయితే, విలువైన వస్తువులు కొనడానికి కొందరు శూన్యమాసం వల్ల కాస్త వెనకాడుతుంటారు. పూర్వం రైతులు డబ్బంతా సాగు పనులకే వాడేవారు కాబట్టి విలాసాలకు దూరంగా ఉండేవారు.
కానీ ఈ ఏడాది జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ‘గురు మౌఢ్యమి’ (మూఢాలు) ఉన్నందున.. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి పెద్ద పనులను ఈ మౌఢ్యమి రోజులు దాటిన తర్వాత మంచి ముహూర్తంలో చూసుకోవడం మంచిది. సాధారణ కొనుగోళ్లు, పెట్టుబడులకు ఎలాంటి అభ్యంతరం లేదు.
4. ఈ నెలలో మాంసాహారం ఎందుకు తినకూడదు?
ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించిన విషయమే. వర్షాకాలంలో సాధారణంగా మనుషులలో జీర్ణశక్తి (ఆకలి) తగ్గుతుంది. ఈ టైమ్‌లో అరగడం కష్టంగా ఉండే మాంసాహారాన్ని తింటే పొట్ట ఖరాబయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ మాసంలో సాత్విక ఆహారం (కూరగాయలు) తినాలని, ఉపవాసాలు ఉంటూ దైవచింతనలో గడపాలని పెద్దలు నియమం పెట్టారు.
5. కొత్త జంటను ఎందుకు దూరంగా ఉంచుతారు?
ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వధువును పుట్టింటికి పంపడం వెనుక సామాజిక, ఆరోగ్య కారణాలు ఉన్నాయి..
తొలి వర్షాలు పడే ఈ కాలంలో రైతులు పొలం పనులపై దృష్టి పెట్టాలి. కొత్త జంట ఒకరితో ఒకరు సమయం గడపడం వల్ల పనులు ఆగకూడదని, కుటుంబంలో మనస్పర్ధలు రాకూడదని ఈ దూరం పెట్టారు. ఆషాఢంలో గర్భం దాల్చితే.. ప్రసవం (డెలివరీ) కరెక్ట్‌గా ఎండలు ఎక్కువగా ఉండే మార్చి, ఏప్రిల్ (వేసవి) నెలల్లో వస్తుంది. పూర్వకాలంలో ఎండల తీవ్రతకు, సరైన వైద్య సదుపాయాలు లేక తల్లీబిడ్డలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆచారాన్ని తెచ్చారు. ఇది మూఢనమ్మకం కాదు, కేవలం ఆరోగ్యం మరియు సామాజిక భద్రత కోసం చేసిన ఏర్పాటు.
