Indian Army: భారత రక్షణ రంగంలో సరిహద్దు భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. సరిహద్దులపై 24 గంటలూ డేగకన్ను వేసి ఉంచేందుకు వీలుగా.. పూర్తి స్వదేశీ సాంకేతికతతో ఒక సరికొత్త ‘స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్రోగ్రామ్ ’ (Stratospheric Airship Program) ను అభివృద్ధి చేస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రక్షణ మంత్రి అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) సమావేశంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోదం లభించింది.
66,000 అడుగుల ఎత్తులో.. నిరంతర నిఘా!
గాలి కంటే చాలా తేలికగా ఉండే ఈ భారీ ఎయిర్‌షిప్‌లను ఆకాశంలో ఏకంగా 20 కిలోమీటర్ల (సుమారు 66,000 అడుగులు) ఎత్తులో, చాలా రోజుల పాటు ఒకే చోట స్థిరంగా గాల్లో తేలియాడేలా డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల లాభాలు ఇవే:
-
24 గంటల నిఘా: సరిహద్దు అవతల శత్రువుల ప్రాంతాల్లో ఏం జరుగుతుందో నిరంతరం పసిగట్టేందుకు (Intelligence, Surveillance and Reconnaissance – ISR) ఇది సహాయపడుతుంది.
-
మెరుగైన కమ్యూనికేషన్: చాలా ఎత్తులో ఉండటం వల్ల మన సైన్యానికి సంబంధించిన కమ్యూనికేషన్ సిగ్నల్స్ వ్యవస్థను కూడా ఇది భారీగా పెంచుతుంది.
శత్రువుల గుట్టు రట్టు చేసే నిఘా నేత్రం!
ఈ ఎయిర్‌షిప్‌లలో అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలను అమరుస్తున్నారు.
శత్రువుల కదలికలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిరంతరం ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఎక్విప్‌మెంట్ ఉంటుంది. దీనిలోని అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రో-ఆప్ట్రానిక్ పరికరాలు శత్రువుల భూభాగంలో చాలా లోతు వరకు స్పష్టంగా చూడగలవు. ఇందులో అమర్చే డే-కెమెరాలు, నైట్ విజన్ డివైజెస్ (రాత్రి పూట చూసే పరికరాలు), థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా శత్రువుల చిన్న కదలికను కూడా పక్కాగా రికార్డ్ చేయవచ్చు.
ఉపగ్రహాలు (Satellites) మరియు బుడగలతో (Balloons) పోలిస్తే లాభాలు ఏంటి?
నార్మల్ బెలూన్ సిస్టమ్స్‌ను మనం కంట్రోల్ చేయడం కష్టం. కానీ ఈ ఎయిర్‌షిప్‌లను మనకు కావాల్సిన సరిహద్దు ప్రాంతం పైకి సులభంగా తరలించి, అక్కడ నిలబెట్టవచ్చు. అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలను లాంచ్ చేయడం, వాటిని మెయింటైన్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఈ ఎయిర్‌షిప్స్ చాలా చౌకగా పనిచేస్తాయి. అంతేకాకుండా, శాటిలైట్లు భూమి చుట్టూ తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తాయి కాబట్టి నిరంతర నిఘా కష్టం. కానీ ఈ ఎయిర్‌షిప్ ఒకే చోట స్థిరంగా ఉంటూ 24 గంటలూ నిఘా వేయగలదు.
మేక్-I, మేక్-II మరియు మేక్-III ల మధ్య తేడాలు ఏంటి?
భారత రక్షణ కొనుగోళ్ల నియమావళి (DAP-2020) ప్రకారం ఈ ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించారు:
-
మేక్-I (Make-I): ఇవి ప్రభుత్వ నిధులతో నడిచే పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు. దీనికి అయ్యే ఖర్చులో 70% నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.
-
మేక్-II (Make-II): ఇవి పూర్తిగా ప్రైవేట్ రక్షణ పరిశ్రమల (ఇండస్ట్రీ) సొంత పెట్టుబడులతో అభివృద్ధి చేసే ప్రాజెక్టులు.
-
మేక్-III (Make-III): విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పూర్తిగా మన భారతదేశంలోనే తయారు చేసే ప్రాజెక్టులు.
ప్రపంచవ్యాప్తంగా పోటీ.. భారత్ ఎటు వైపు?
ప్రస్తుతం భారత సాయుధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) వేగంగా ఆధునీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. భారతదేశంతో పాటు అమెరికా, చైనా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, సౌత్ కొరియా వంటి అగ్రదేశాలు కూడా ఇలాంటి ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫారమ్స్ తయారు చేసే పనిలో ఉన్నాయి.
మన సైన్యం ప్రస్తుతం యుద్ద రంగంలో ‘సెన్సార్-టు-షూటర్’ (Sensor-to-Shooter Chain) వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అంటే.. సరిహద్దుల్లో శత్రువుల టార్గెట్‌ను మొదట గుర్తించడం, వెంటనే ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు పంపడం, తక్కువ సమయంలోనే దానిపై అత్యంత ప్రభావవంతంగా దాడి చేసి కూల్చేయడం అన్నమాట.
దీనికోసం సైన్యం అన్ని స్థాయిల్లో అత్యాధునిక డ్రోన్లు, హై-ఎండ్ ఇంటెలిజెన్స్ విమానాలు (ISTAR), నిఘా శాటిలైట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఒకవేళ యుద్ధ సమయంలో ఒక వ్యవస్థ ఫెయిల్ అయినా.. మరో వ్యవస్థ రంగంలోకి దిగేలా ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేసే పటిష్టమైన నెట్‌వర్క్‌ను భారత్ సిద్ధం చేస్తోంది.
