Ebola Virus

Ebola Virus: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు ఉగాండా మహిళ తరలింపు!

Ebola Virus: ఆఫ్రికా దేశాలలో ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తున్న ప్రమాదకరమైన ‘ఎబోలా వైరస్’ ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెడుతోంది. ఈ తరుణంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎబోలా వైరస్ వంటి లక్షణాలతో ఒక విదేశీ మహిళ ఆస్పత్రిలో చేరడం తీవ్ర కలకలం రేపింది. ఆఫ్రికా దేశమైన ఉగాండా నుంచి వచ్చిన సదరు మహిళలో ఈ వ్యాధికి సంబంధించిన ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగాండా దేశానికి చెందిన 28 ఏళ్ల మహిళ ఈ నెల 23న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ప్రస్తుతం ఎబోలా వైరస్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే ఆ ఉగాండా మహిళకు ఎబోలా వ్యాధిని పోలిన కొన్ని తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు విమానాశ్రయ వైద్యాధికారులు గుర్తించారు.

ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఆమెను వెంటనే ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ లో ఉంచారు. ఆమె శరీరం నుంచి రక్తం వంటి శాంపిల్స్ సేకరించి, పూర్తి స్థాయి పరీక్షల కోసం పుణే నగరంలోని ప్రముఖ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ (NIV) ల్యాబ్‌కు పంపించారు. ఈ పరీక్షల ఫలితాలు రావడానికి మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ రిపోర్టులు వస్తేనే ఆమెకు ఉన్నది ఎబోలా వైరస్ అవునా కాదా అనేది స్పష్టంగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ఈ విషయంపై కర్ణాటక ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిత్విక్ రంజన్ పాండే మాట్లాడుతూ.. ఆ మహిళ ప్రస్తుతం వైద్యుల పూర్తి పర్యవేక్షణలో ఉందని తెలిపారు. ల్యాబ్ నివేదికలు వచ్చే వరకు ఆమెకు ఎబోలా సోకిందని ఖచ్చితంగా చెప్పలేమని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. విమానాశ్రయాల వద్ద నిఘాను మరింత పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *