Kishan Reddy: తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సంస్థను గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి తీవ్రంగా దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నిర్వహించిన ‘సింగరేణి భరోసా యాత్ర’లో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులపై ఉన్న ఆదాయపు పన్ను (ఇన్కమ్ టాక్స్) భారాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూల చర్యలు తీసుకుంటుందని ఆయన ఒక పెద్ద హామీ ఇచ్చారు.
‘తాత జాగీరు’ లాగా వాడుకున్నారు!
-
జేబు సంస్థగా మార్చారు: గతంలో కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవిని వాడుకుని, సింగరేణిని తమ సొంత కుటుంబ జేబు సంస్థగా మార్చుకుని ఇష్టారాజ్యంగా వేల కోట్లు దోచుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలన వల్ల సింగరేణి సంస్థ ఏకంగా 15 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందన్నారు.
-
నిధుల దారిమళ్లింపు: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను, నిధులను బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయకుండా.. కేసీఆర్ తన కుటుంబ సభ్యుల నియోజకవర్గాలకు దారిమళ్లించారని ఆరోపించారు.
-
మార్పు లేని కాంగ్రెస్ పాలన: ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పాత దారిలో నడుస్తోందని.. సింగరేణి సంస్థ ఏమైనా వాళ్ల తాత జాగీరా? అన్నట్లుగా గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని దుయ్యబట్టారు.
జెన్కో బకాయిలు.. అప్పుల కుప్ప!
-
రేవంత్ రెడ్డి హయాంలో అప్పులు: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జెన్కో (TS Genco) నుంచి సింగరేణికి రూ.8,958 కోట్ల అప్పు (బకాయిలు) ఉంటే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఈ రెండున్నరేళ్లలోనే ఆ అప్పును ఏకంగా రూ.26,875 కోట్లకు పెంచేశారని కిషన్ రెడ్డి లెక్కలతో సహా విమర్శించారు.
-
కేంద్రాన్ని బెదిరిస్తున్నారు: రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేస్తూ, ఇప్పుడు అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడుతోందని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
సింగరేణి డబ్బుతో స్కూళ్లు, ఫుట్బాల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘యంగ్ ఇండియా స్కూల్స్’ నిర్మాణం కోసం సింగరేణి నిధుల నుంచి రూ.500 కోట్లు గుంజారని, అలాగే మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కోసం కూడా సింగరేణి డబ్బులనే వాడేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
బొగ్గు నిల్వలు.. వాటాల గొడవలు
-
నాణ్యతపై తప్పుడు ప్రచారం: కర్ణాటక రాష్ట్రానికి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయలేని పరిస్థితి తెచ్చారని.. సింగరేణిలో నాణ్యమైన బొగ్గు లేదంటూ ప్రచారం చేయడం చాలా ప్రమాదకరమని అన్నారు.
-
రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ అవకాశం: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్లో సుమారు 434 మిలియన్ టన్నుల మేలు రకపు (గ్రేడ్-8) బొగ్గు నిల్వలు ఉన్నాయని.. దీని ద్వారా సింగరేణికి ఏకంగా రూ.1.20 లక్షల కోట్ల బిజినెస్ (టర్నోవర్) వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.
-
మంత్రుల మధ్య వాటాల గొడవ: ఒడిశాలోని ‘నైనీ కోల్ బ్లాక్’ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులే రెండు గ్రూపులుగా విడిపోయి, తమ సొంత వాటాల (కమీషన్ల) కోసం గొడవలు పడుతున్నారని కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి బొగ్గు గనులను, కార్మికులను కాపాడుకోవడానికి బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
