Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల తలెత్తిన థియేటర్ల బంద్, పర్సంటేజ్ వ్యవహారం, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ వివాదాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు సమస్య ఎక్కడ మొదలైందో, ఎలా ముందుకెళ్లిందో స్పష్టంగా వివరించారు.
పర్సంటేజ్ సమస్య – ఎక్కడ మొదలైందంటే?
ఏప్రిల్ 19న తూర్పు గోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమై తమ సమస్యలు వివరించారని దిల్ రాజు చెప్పారు. “ప్రస్తుతం థియేటర్లలో మొదటి వారం రెంట్ బేసిస్, రెండో వారం నుంచి పర్సంటేజ్ విధానం నడుస్తోంది. ఇది ఎగ్జిబిటర్లకు కష్టంగా మారింది. వాళ్లు మా దృష్టికి తీసుకువచ్చారు. అందుకే మేమూ వారి స్టేట్మెంట్స్ అడిగాం. గత 6 నెలల రికార్డులు చూద్దాం అనుకున్నాం,” అని వివరించారు.
ఈ సమావేశం విషయాలు ఏప్రిల్ 26న హైదరాబాదులో జరిగిన నిర్మాతల గిల్డ్ మీటింగ్‌లో చర్చించారని తెలిపారు. అయితే, సమస్యకు ఓ పరిష్కారం కనపడకపోవడంతో, జూన్ 1నుంచి థియేటర్లు మూసేస్తామని ఎగ్జిబిటర్లు లేఖలో పేర్కొన్నారు.
థియేటర్ల బంద్‌పై క్లారిటీ
దిల్ రాజు మాట్లాడుతూ, “థియేటర్ల మూసివేతను ముందే తప్పని సూచించాను. కానీ కొన్ని వార్తలు మీడియాలో ముందు ముందు వచ్చాయి. అసలు మేము అందరం కలిసి producers–exhibitors meeting పెట్టాం. చర్చలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు బంద్ గురించి ముందే ప్రచారం చేయడం సరైంది కాదు” అని అన్నారు.
నైజాంలో మొత్తం 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నప్పటికీ, తనకు సంబంధించి ఎస్వీసీఎస్ థియేటర్లు కేవలం 30 మాత్రమేనని చెప్పారు. “మా దగ్గర ఉన్నవి కేవలం 30. ఏషియన్, సురేష్ సంస్థలకు కలిపి 90 ఉన్నాయి. మిగతా 250 థియేటర్లు స్వతంత్రంగా ఉన్నవాళ్లు నిర్వహిస్తున్నారు. అందరూ కలిసి మాట్లాడకుండా, మనల్ని లక్ష్యంగా చేయడం సరి కాదు,” అని అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ సినిమా వివాదం – సబ్జెక్ట్ డైవర్షన్
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునే ప్రయత్నం జరిగినట్టు ప్రచారం రావడంపై తీవ్రంగా స్పందించిన దిల్ రాజు, “ఆయన సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదు. ప్రభుత్వం వరకు తప్పు సమాచారం వెళ్లింది. మంత్రితో మాట్లాడి స్పష్టత ఇచ్చాను,” అని తెలిపారు.
Also Read: Kandula Durgesh: సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది వాస్తవం
ఐక్యత అవసరం
“ఇండస్ట్రీలో అందరం ఒక్కటిగా ఉండాలి. ఒక సినిమా వచ్చినప్పుడు టికెట్ ధరల కోసం పరుగులు చేయడం కాదు. సినిమాకు సంబంధించి ఉన్న సమస్యలపై సమష్టిగా ముందుకు వెళ్లాలి. ఇద్దరు ముగ్గురు మాట్లాడడం కాదు, మొత్తం పరిశ్రమ ఒక వేదికపై ఉండాలి,” అని అన్నారు.
మున్ముందు భారీ సినిమాల విడుదలలున్నాయి. మే 30: భైరవ, జూన్ 5: కమల్ హాసన్ చిత్రం, జూన్ 12: హరిహర వీరమల్లు, జూన్ 20: కుబేర, జూలై 4: కింగ్‌డమ్ విడుదలలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
దిల్ రాజు చివరిగా పేర్కొన్నట్లుగా, “ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం రావాలంటే, పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కలిసి ఆలోచించాలి. ప్రభుత్వాలు సైతం సహకరించాలి. మరింత ముందుకు వెళ్లాలంటే ఐక్యతే మార్గం” అని స్పష్టం చేశారు.