Yash: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ (సుమారు 4000 కోట్లు) తో నిర్మిస్తున్న ‘రామాయణం’ సినిమా గురించి రాకింగ్ స్టార్ యశ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సీత పాత్రలో సాయి పల్లవి, యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. నమిత్ మల్హోత్రా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా రాముడి పాత్రకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసిన మూవీ టీమ్, అప్పటివరకు ఉన్న అనుమానాలను తొలగించి సినిమాపై ఆసక్తిని పెంచింది.
రణబీర్, యశ్ కాంబో సీన్స్ ఎప్పుడు?
తాజాగా యశ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇప్పటివరకు తనకి, రణబీర్‌కు మధ్య ఒక్క సన్నివేశం కూడా తీయలేదని చెప్పారు. ఇద్దరికీ తమ తమ రాజ్యాలు (లంక, అయోధ్య) ఉన్నాయి. సినిమాను రెండు భాగాలుగా తీస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే కథలో ఇద్దరూ కలుసుకునే సన్నివేశాలు ఇంకా రాలేదని ఆయన చెప్పారు. కానీ సెట్స్‌లో రణబీర్‌ను కలిసినప్పుడు తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ఆయన వర్కింగ్ స్టైల్ గొప్పగా ఉంటుందని యశ్ ప్రశంసించారు.
రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో మొదటి పార్ట్‌లో.. రాముడి పుట్టుక నుండి మొదలుపెట్టి వివాహం, వనవాసం, సీతా అపహరణ వరకు చూపించనున్నారు. మరోవైపు రావణాసురుడు తన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు, శివునిపై ఆయనకు ఉన్న భక్తి వంటి ముఖ్యమైన సన్నివేశాలు ఉండనున్నాయి. రాముడు లేని సమయంలో సీతను రావణుడు ఎత్తుకెళ్లడంతో మొదటి భాగం ముగియనుంది. ఆ తర్వాత రాముడు రావణాసురుడిని ఓడించి సీతను ఎలా తిరిగి తెచ్చుకున్నాడు అనేది రెండో భాగంలో చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాకు హన్స్ జిమ్మర్ మరియు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. యశ్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
