Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, సాయంత్రం వరకు కొనసాగుతోంది. కేవలం ఎండ మాత్రమే కాకుండా, వేడి గాలులు తోడవడంతో ప్రజలు ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాబోయే మూడు నుంచి ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 73 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇప్పటికే కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం వంటి జిల్లాల్లో కూడా ఎండ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ నెల 18వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో కూడా ఎండలు రికార్డులను తిరగరాస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటేశాయి, వచ్చే మూడు రోజుల్లో ఇవి 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట వంటి జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.
ఎండల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు వాడటం, టోపీ ధరించడం లేదా తలకు రుమాలు చుట్టుకోవడం వంటివి చేయాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
