Kandula Durgesh: తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రభుత్వ సహకారం ఎంత అవసరమో మళ్ళీ ఒకసారి స్పష్టమైంది. సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఉన్నా, థియేటర్ల నిర్వహణ విషయాలు హోంశాఖ పరిధిలోకి వస్తాయని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. టికెట్ల ధరల అంశంపై ఇటీవల చుట్టూ తిరిగిన వివాదాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
“టికెట్ల ధరలు పెంచాలని నిర్మాతలు కోరినప్పుడు, పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటున్నాం. కానీ వెంటనే ఎవరో కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది,” అని మంత్రి అన్నారు.
చిత్రరంగ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను గుర్తించిన దుర్గేష్
“గత ప్రభుత్వ హయాంలో సినీ రంగాన్ని వేధించారని చాలా మంది అంటున్నారు. కానీ, చంద్రబాబు నాయుడు గారు మాత్రం పరిశ్రమ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు. ఇదీ వాస్తవం,” అని దుర్గేష్ పేర్కొన్నారు. అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలూ వాస్తవమేనని తెలిపారు.
వీరమల్లు వివాదంపై ఘాటుగా స్పందించిన దుర్గేష్
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో తప్పుడు ప్రచారం చేశారని, ముద్దుల వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒక సినిమా విడుదల సమయంలోనే వివాదాలు సృష్టించడం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అన్నదానిపై జనం తీర్పు చెప్పాలి. కానీ ముందే తప్పుడు మాటలు మాట్లాడడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం,” అన్నారు దుర్గేష్.
సినిమా మనుగడకు కూటమి సర్కార్ అండ
తెలుగు సినిమా పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్ని వర్గాల వ్యక్తులకు ఉపాధి కల్పిస్తున్నాయి. “ఒక రూపాయి టికెట్ ధర పెంచితే ప్రభుత్వానికి పావలా జీఎస్టీ వసూలవుతుంది. నిర్మాతలు ఎన్నో సంవత్సరాలు పెట్టుబడి పెట్టి, సినిమా విడుదల చేసే సమయంలో ఈ రకమైన వివాదాలు రావడం క్షోభ కలిగిస్తోంది,” అని వ్యాఖ్యానించారు.
చివరగా, “మా సమస్య మేమే పరిష్కరించుకుంటామని అహంభావంతో వ్యవహరించకుండా, పరిశ్రమ క్షేమానికి అందరూ కలసి పనిచేయాలి. ప్రభుత్వ సహకారం ఉంటేనే సినిమాల బతుకుదెరువు కొనసాగుతుంది,” అని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.