KCR: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలపాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది. మంగళవారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావులు భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బిల్లులపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మహిళా రిజర్వేషన్ల అమలు ఇప్పటికే చాలా ఆలస్యమైందని, అందుకే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలోనే తెలంగాణ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
అయితే, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో మాత్రం భారాస ఆచితూచి అడుగువేయాలని నిర్ణయించుకుంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో దక్షిణాది వాటా 24 శాతంగా ఉంది. కొత్త విభజన వల్ల ఈ శాతం తగ్గితే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందని, ఇది అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టదాయకమని చర్చించారు.
అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న నిష్పత్తి దెబ్బతినకుండా, సీట్ల సంఖ్యను పెంచితే బాగుంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులో ఎలాంటి నిబంధనలు ఉంటాయో తెలియకుండా ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదని బీఆర్ఎస్ భావిస్తోంది. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత, అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉంటేనే మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.
ఈ కీలక భేటీలో కేవలం పార్లమెంటు అంశాలే కాకుండా.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభ, అలాగే ఏప్రిల్ 27న జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోయినా, రాజ్యసభలో ఉన్న ముగ్గురు ఎంపీల ద్వారా పార్టీ గళాన్ని బలంగా వినిపించాలని వ్యూహం రచించారు.
