Droupadi Murmu: హైదరాబాద్ శీతాకాల పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేదీలు ఖరారయ్యాయి. ప్రతి ఏడాది డిసెంబర్లో జరిగే వింటర్ సోజర్న్ సంప్రదాయాన్ని ఈసారి కూడా రాష్ట్రపతి కొనసాగిస్తున్నారు. ఇందుకోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని అధికారులు ముందుగానే శుభ్రపరిచారు, భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు.
Also Read: Indigo Shares: ఇండిగో షేర్ల భారీ పతనం.. అసలు కారణమేంటి? విమానాల రద్దు ఎందుకైంది?
షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ముర్ము ఈ నెల 17న హైదరాబాద్కు చేరుకోనున్నారు. డిసెంబర్ 22 వరకు ఆమె నగరంలోనే ఉంటారు. సుమారు ఐదు రోజుల ఈ పర్యటనలో ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా డిసెంబర్ 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి ఆమె హాజరవుతారు. తదుపరి రోజు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో గ్లోబల్ పీస్ కమిటీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.
డిసెంబర్ 21న రాష్ట్రపతి పలు సంఘాల, సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం నిర్వహించే తేనీటి విందులో కూడా ఆమె పాల్గొంటారు. చివరిగా, డిసెంబర్ 22 ఉదయం ఆమె ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా నగరంలో విస్తృత భద్రత ఏర్పాట్లు చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే సమన్వయం చర్యలు ప్రారంభించారు.

