బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నదని విద్యార్థి నిరుద్యోగులు మా ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమానికి పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికి తెలుసన్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.
ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, ఈ ప్రభుత్వాన్ని దించేస్తామని శాపనార్థాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి వరద సహాయం సాధించే విషయంలో ప్రతిపక్షం సహకరించాలన్నారు. ప్రతిపక్షాల సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి.

