Ponnam Prabhakar: కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల బీసీ రిజర్వేషన్లు, కులగణన, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చలు జరిగాయని, కులగణనపై రేపు మరియు ఎల్లుండి కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 5న కులగణనపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఐకాన్ సిటీ హైదరాబాద్‌కు కేంద్రం ఏమిచ్చిందో ప్రశ్నించారు. బీజేపీ నేతలు భిక్షాటన చేయడం కాకుండా, తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంపై పోరాటానికి తమతో బీఆర్‌ఎస్ కలిసిరావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

