Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, పదేళ్ల ప్రజల కష్టాలు, బాధలకు ముగింపు పలికేలా దేశానికి రోల్ మోడల్ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి తొందరపాటు నిర్ణయాలు ఉండబోవన్నారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహశీల్ధార్ కార్యాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అదే విదంగా కాటమయ్య కిట్స్, కల్యాణ లక్ష్మీ చెక్కులు, షాదిముబారక్ చెక్కులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, బాలాజీసింగ్, శ్రీనివాస్ రెడ్డి, యాట నర్సింహా, అధికారులు పాల్గొన్నారు.