Ponglueti: పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. గృహావసరాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రత్యేక అనుమతులను మంజూరు చేస్తూ, పేదలకు సొంత ఇల్లు కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
నగరాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖల పరిధిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య ప్రకటన చేశారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 69 ప్రకారం, జీప్లస్-1 (G+1) ఇళ్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వబడింది. అంటే, ఒక అంతస్తు పైగా మరో అంతస్తు నిర్మించుకునే అవకాశం కల్పించబడింది.
ప్రత్యేకంగా 30 చదరపు మీటర్ల (సుమారు 60 గజాల) విస్తీర్ణంలో ఉన్న స్థలాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు ఇలాంటి చిన్న విస్తీర్ణం ఉన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించడానికి అనుమతులు లేవు. కానీ, ఈ జీవోతో ఆ పరిమితిని సడలించి పేదలకు ఊరటనిచ్చింది ప్రభుత్వం.
ఈ నిర్ణయం వల్ల పట్టణాల్లో చిన్న స్థలాల్లో నివసిస్తున్న వేలాది మంది పేద కుటుంబాలకు లబ్ధి కలగనుంది. తక్కువ విస్తీర్ణంలో నివాస సౌకర్యాలు మెరుగుపరచుకునే అవకాశం కలగడంతో, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, “పేదల కలల ఇల్లు సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎవరూ గృహరహితులుగా మిగలకుండా చర్యలు కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ జీవో వెంటనే అమల్లోకి వస్తుందని, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.