Ponglueti srinivas: ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఇల్లెందులో సత్యనారాయణపురం నెంబర్–2 బస్తి, ఎన్జీవోస్ కాలనీలో వంతెనలు, ఆర్ అండ్ ఆర్ కాలనీలో సీసీ రోడ్లు, జంక్షన్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వ కేంద్రం, రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ప్రజా పాలన లక్ష్యం అని అన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తోందని, అందుకే ప్రజల మన్ననలు లభిస్తున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం కూడా దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఇల్లందు అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ వైద్యశాలలో ఐసీయూ ఆపరేషన్ థియేటర్, వెయిటింగ్ హాల్ షెడ్ నిర్మాణానికి అంబులెన్స్ ఇవ్వాలని ఐటీడీఏ పీవో రాహుల్కు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. 15 రోజుల్లో పనుల పురోగతి కనిపించాలని ఆయన సూచించారు.
ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల గిరిజనులు, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్య బృందం కృషి చేయాలని మంత్రి సూచించారు. నూతన 100 పడకల వైద్యశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయిస్తామని కూడా హామీ ఇచ్చారు. అనంతరం వైద్యశాలలో సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

