PM Narendra Modi:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పర్యటించనున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఆయన ఏపీకి రావడం ఇది రెండోసారి. సాయంత్ర ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి బయలుదేరి వెళ్లిపోతారు. ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
PM Narendra Modi:ప్రధాని మోదీ ఈ రోజు సాయంత్రం తొలుత 4.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం 4.45 గంటలకు ప్రధాని మోదీ రోడ్‌షో విశాఖ నగరంలో ప్రారంభమవుతుంది. ఈ రోడ్‌షో నగరంలోని వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ నుంచి ఏయూ కాలేజీ వరకు కొనసాగుతుంది. ఈ రోడ్‌షో కార్యక్రమంలో ప్రధానితో పాటు ఎన్డీఏ కూటమి ముఖ్యనేతలైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు.
PM Narendra Modi:అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఇదేరోజు సాయంత్రం 5.30 గంటలకు రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారు.
PM Narendra Modi:ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకున్నది. 5 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్ అధికారులు, 18 మంది ఏఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలు పాల్గొంటున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
PM Narendra Modi:బహిరంగ సభ అనంతరం 6.55 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 7 గంటలకు విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో ఒడిశాలోని భువనేశ్వర్‌కు చేరుకుంటారు. అక్కడ గురువారం జరిగే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
PM Narendra Modi:ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్త్రత ఏర్పాట్లను చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఏర్పాట్లను ఈ రోజు ఉదయం పరిశీలించారు. సంబంధిత అధికారులక పలు సూచనలు చేశారు. ప్రధాని పాల్గొనే రోడ్‌షో కార్యక్రమంలో సుమారు లక్ష మంది పాల్గొంటారని, సభలో 2 లక్షల మందికి పైగా పాల్గొంటారని వారు తెలిపారు.