PM Narendra Modi:వన్డే ప్రపంచకప్ గెలుపొందిన టీమిండియా మహిళా జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రపంచకప్ మహిళా జట్టు చాంపియన్లకు ఆతిథ్యం ఇచ్చారు. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా భారత జట్టు సభ్యులు ప్రపంచకప్‌తోపాటు నమో 1 జెర్సీని ప్రధాని మోదీకి అందజేసి ఆనందం పంచుకున్నారు.
PM Narendra Modi:ఇదే జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2017లో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుర్తుచేశారు. అప్పుడు ట్రోఫీ లేకుండానే కలువగా, ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీతో ప్రధానిని కలువడం విశేషం. వరుసగా మూడు పరాజయాలు, ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న తర్వాత అద్భుతమైన పునరాగమనాన్ని పురస్కరించుకొని వారు ప్రధానిని కలిశారు.
PM Narendra Modi:ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలిచిన మహిళా జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు తరాలు క్రీడల్లో విశేష ప్రతిభను చాటేందుకు దోహదపడుతుంది. మహిళా క్రీడాకారుల అసమాన ప్రతిభ, అద్వితీయ ప్రదర్శనకు తగిన ఫలితం ఇది. ఈ విజయం మహిళా క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీరంతా ఫైనల్ పోటీలో గొప్ప నైపుణ్యం, ఆత్మ విశ్వాసంతో క్రీడా ప్రతిభను చాటారు… అని ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

